రేషన్‌ బియ్యంతో మాఫియా జల్సా!

* అక్రమంగా తరలిపోతున్న పేదల బియ్యం
* వేల కోట్ల రూపాయల చీకటి వ్యాపారం
* వైకాపా నేతలకూ భాగస్వామ్యం!
* ఫిర్యాదు చేసే వారిపై దాడులు
* హత్యలకు సైతం తెగబడుతున్న దుండగులు
* చోద్యం చూస్తున్న యంత్రాంగం
* చేష్టలుడిగిన జగన్ ప్రభుత్వం

”కాదేదీ కాసులకనర్హం!”
ఇది వైకాపా ప్రభుత్వం అనధికార పాలసీ విధానమనుకోవచ్చు…
ఇసుక, మద్యం, భూములు, గనులు, నీటి వనరులు… ఇలా దేన్నయినా కాసుల కేంద్రంగా మార్చుకుంటున్న అక్రమార్కులు ఇప్పుడు రేషన్‌ బియ్యాన్ని కూడా వదలడం లేదు.
వైకాపా నేతల అండదండలతో అడుగడుగునా రెచ్చిపోతున్న మాఫియా వర్గాలు పేదల కడుపు నింపే బియ్యాన్ని అక్రమార్జనకు ఆలంబనగా మార్చుకుంటున్నాయి.
ఫలితంగా పేదల బియ్యం పథకమే అపహాస్యమై వేలాది కోట్ల రూపాయల చీకటి వ్యాపారం విస్తరిల్లుతోంది. సామాన్యుల గూటికి చేరాల్సిన బియ్యం, మాఫియా వర్గాల గుప్పిటలోకి చేరి కాసులు కురిపిస్తూ బడా బాబుల జేబులు నింపుతోంది.
ఈ మొత్తం వ్యవహారం లోతుల్లోకి వెళితే, విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి.
అంతా కళ్ల ముందే జరుగుతున్నా….
అధికారులు జోక్యం చేసుకోరు!
పోలీసులు పట్టించుకోరు!
నేతలు పెదవి విప్పరు!
ప్రభుత్వం చర్యలు తీసుకోదు!
ఎందుకంటే…
అధికార పార్టీ అండదండలున్నాయి కనుక!
పాలక పార్టీ అనుచరుల వ్యవహారం కనుక!
అడ్డగిస్తే అవస్థలు ఎదురవుతాయి కనుక!
ఎవరి వాటాలు వారికి చేరతాయి కనుక!
ఇక అంకెలు చెప్పే వివరాల్లోకి వెళితే పేదల ప్రయోజనానికి గండి కొడుతూ, ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తూ… వ్యవస్థీకృతమైన అవినీతి ఎలా వేళ్లూనుకుని పోయిందో అర్థం అవుతుంది.
రాష్ట్రంలో మొత్తం కోటీ 45 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి…
దాదాపు 4.5 కోట్ల మంది రేషన్‌ వినియోగదారులు ఉన్నారు…
ఒకొక్కరికి నెలకు 5 కిలోల వంతున బియ్యం ఇస్తున్నారు…
అలా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల టన్నుల బియ్యం సరఫరా అవుతోంది…
బియ్యం సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ ఆధ్యర్యంలో 200 కి పైగా స్టాకు పాయింట్టు ఉన్నాయి…
ఈ పాయింట్ల నుంచి దాదాపు 29, 791 రేషన్‌ షాపుల డీలర్లు బియ్యాన్ని తీసుకు వెళతారు…
ఈ వివరాలు చూస్తే… పైకి అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు చూస్తే కనిపించేది వేరు. ఇలా సరఫరా అయ్యే బియ్యంలో సింహభాగం అక్రమ వ్యాపారుల పంచకు చేరుతోంది.
ఇలా… ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఏటా రూ.2,700 కోట్ల రూపాయల విలువైన బియ్యం పక్క దారి పడుతోందనేది ఓ అంచనా!
దీనికి కారణాలు పరిశీలిస్తే అడుగడుగునా పేరుకుపోయిన లొసుగులు, లోపాయికారీ విధానాలు అర్థం అవుతాయి.
చౌక దుకాణాలు, లేదా ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించే వాహనాల ద్వారా వచ్చే బియ్యాన్ని పేదలు అక్కడికక్కడే ఎంతో కొంత ధరకు అమ్ముకుంటున్నారు. మరి ఇది పేదల నిర్లక్ష్యమా? అంటే కాదనే చెప్పుకోవాలి. దీని వెనుక కూడా పలు కారణాలు కనిపిస్తాయి.
పౌర సరఫరాల విధానం ద్వారా పంపిణీ చేసే బియ్యం నాణ్యత సరిగా లేకపోవడం ఒక కారణం.
మరో కారణం కొందరు వాళ్లకి ఆశ చూపో, నచ్చచెప్పో ఆ బియ్యాన్ని సేకరించడం. ఉచితంగా వచ్చే బియ్యాన్ని అడిగిన వారికి ఇచ్చేస్తే నాలుగు డబ్బులు చేతిలో పడతాయి కదా అనేది లబ్దిదారుల వైపు నుంచి కనిపించే కారణం. ఏది ఏమైతేనేం… ఇలా రేషన్‌ బియ్యంలో అధిక భాగాన్ని కిలో రూ.7 నుంచి రూ. 10 రూపాయల వంతున పేదల చేతిలో పెట్టి దారి మళ్లిస్తున్నారు. వాహనాల ద్వారా బియ్యాన్ని అందించే నిర్వాహకులే లబ్దిదారులకు అక్కడికక్కడే డబ్బులు ఇచ్చేస్తున్న ఉదంతాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇలా సరఫరా కాకుండా మిగిలిపోయే బియ్యాన్ని ఆ వాహన నిర్వాహకులు మాఫియా వ్యాపారులకు కిలో సుమారు 15 రూపాయలకు అమ్మేస్తున్నారు.
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నెలా 1.5 లక్షల టన్నుల రేషన్‌ బియ్యం అక్రమంగా దారి మళ్లుతోందని అంచనా.
ఈ మొత్తం వ్యవహారం ఎంత పకడ్బందీగా సాగుతోందంటే… మాఫియా వ్యాపారులు ఇలా రేషన్‌ బియ్యాన్ని సేకరించడానికి ప్రత్యేకమైన సిబ్బందిని సైతం నియమించుకున్నారు. అంతేకాదు ఈ బియ్యాన్ని నిల్వ చేయడానికి ఎక్కడికక్కడ రహస్యమైన గోడౌన్లు కూడా ఏర్పాటయ్యాయి. ఆయా స్థావరాల నుంచి ఈ బియ్యాన్ని లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి మిల్లుల్లో మర పట్టించి పాలిష్‌ చేయిస్తారు. అలా రూపు మార్చుకున్న పేదల బియ్యాన్ని బ్రాండెడ్‌ బియ్యంగా బహిరంగ మర్కెట్లో కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు అమ్ముకుంటున్నారు. కథ ఇక్కడితే అయిపోలేదు. బహిరంగ మార్కెట్ తో పాటు ఈ బియ్యాన్ని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఇతర రాష్ట్రాలకు, ఆఫ్రికా లాంటి కొన్ని దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు. అలా ఎగుమతి అయ్యే బియ్యం రేటు మరింతగా ఉంటుంది. ఇలా పేదల కోసం ఉచితంగా సరఫరా అవుతున్న బియ్యం… బడా బాబుల జేబులు నింపుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాఫియా నెట్‌వర్క్ విస్తరించిందంటే ఆశ్చర్యం వేయక మానదు.
అంతేకాదు… పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని 200 స్టాకు పాయింట్ల నుంచి సైతం బియ్యం తరలిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగంటే… డీలర్లకు కచ్చితంగా కాటా వేసి కాకుండా బస్తాల ద్వారా అందిస్తున్నారు. బస్తాలలో రెండు మూడు కిలోల వరకు తరుగు ఉంటోందని డీలర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా డీలర్లకు అందాల్సిన బియ్యంలో ప్రతి నెలా రెండు మూడు క్వింటాళ్ల బియ్యం స్ఠాక్‌ పాయింట్లలోనే మిగిలిపోతోంది. ఇది కూడా అక్రమార్కుల అడ్డాకు చేరుతుందని వేరే చెప్పక్కరలేదు. అంటే ఈ గోడౌన్ల ఇంఛార్జిలు, కింది స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా మాఫియా మాయ చేస్తోందన్నమాటే. దాంతో మొత్తం మీద కోట్లాది రూపాయిల విలువైన బియ్యం తరలిపోతోందనడానికి గత ఏడాదిగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలే సాక్ష్యం.
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం పేరు చెప్పి కేటాయించే కిలో రూపాయి బియ్యం… మరో వైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే బియ్యం… మాఫియా చేతికి చేరిపోతున్నా ఎక్కడా చీమ చిటుక్కుమనదు.
మరి ఇదంతా ఎక్కడికక్కడ తనిఖీలు చేయాల్సిన అధికారులకు తెలియదా?
ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నామని చెప్పుకునే అధికార పార్టీ నేతలకు తెలియదా?
పోలీసులకు ఉప్పందదా?
భారీ వాహనాలను ఆపి పత్రాలన్నీ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించే నిఘా వ్యవస్థకు అనుమానమే రాదా?
పైకి అన్ని పాలన వ్యవస్థలూ సవ్యంగానే కనిపిస్తాయి. కానీ ఎవరూ పట్టించుకోరు. బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా దర్జాగా సాగిపోతూనే ఉంటాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… బియ్యం అక్రమ రవాణా వాహనాలకు ముందు పైలట్‌ వాహనాలు వెళతాయి. అవి రాబోయే అక్రమ వాహనానికి లైన్‌ క్లియర్‌ చేస్తాయి.
అలా… అందరికీ అన్నీ తెలుసు. కానీ చూసీ చూడనట్టు ఉంటారు.
అడపాదడపా ఎవరైనా ఇచ్చిన సమాచారం మేరకు ఏవైనా వాహనాలను సీజ్‌ చేసినా… కొన్ని గంటల వ్యవధిలోనే అవి బయటకి వచ్చేస్తాయి.
కారణం… ముడుపులు! వాటాలు!
కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి అధికారికే కాదు… పాలక పార్టీ నేతలకు సైతం ఎవరికి ముట్టేది వారికి ముడుతోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఒకో బియ్యం లారీని సరిహద్దులు దాటించేందుకు రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు ముడుపుల ముసుగులో చేతులు మారుతోంది.
ముడుపులతో పాటు మరో కారణం… అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఉద్దేశంతో మిన్నకుండడం. ఎందుకంటే… ఎక్కడైనా ఒక వాహనాన్ని ఆపినా, తనిఖీ చేసినా, కేసు బుక్‌ చేసినా… ఆపై జరిగే పరిమాణాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ మధ్య కాలంలో జరిగే దాడులు, దౌర్జన్యాలే నిదర్శనం. అందుకు తాజా ఉదాహరణ ఈ మధ్య గుంటూరు జిల్లాలో జరిగిన ఓ బియ్యం వ్యాపారి హత్యే. దీని వెనుక బియ్యం మాఫియా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎవరూ నోరు విప్పరు. ఎందుకంటే… అక్కడ అధికార పార్టీ వారి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనే అనుమానాలు, విమర్శలు వినిపిస్తున్నాయి.
అలా ఒక్క చోటే కాదు… కొన్ని నియోజక వర్గాల్లో నేతలకు నెలకు రూ. 5 లక్షల వంతున కూడా ముడుతోందనే ప్రచారం ఉంది.
మొత్తానికి ఇది…
బియ్యం అక్రమ రవాణా కథ!
వేలాది కోట్ల రూపాయల చీకటి వ్యాపారం కథ!
దారి మళ్లుతున్న ప్రజాధనం కథ!
హరించుకుపోతున్న పేదల ప్రయోజనం కథ!
అవినీతి నేతల అరాచకాల కథ!
చేష్టలుడిగిన ప్రభుత్వం కథ!
వెరశి… సామాన్య ప్రజల ప్రత్యక్ష వ్యథ!!