తెలుగు లోగిళ్లలో మకర సంక్రాంతి పర్వదినం

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు. నేటి నుంచి ఉత్తరాయన పుణ్యకాలం ఆరంభం! పంటలు చేతికొచ్చి ధాన్యలక్ష్మి అనుగ్రహించే కాలం! ప్రతి ఇంటా ధనలక్ష్మి సిరులు కురిపించే సమయం. తెలుగు లోగిళ్లలో కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి పర్వదినం నేడు. హరిదాసుల సంకీర్తనామృతం.. డూడూ బసవన్నల సన్నాయి రాగం.. పచ్చని పంట పొలాలపై పైరు వొంపుల పలకరింపుల కోసం.. ఇంటిముంగిట మగువల రంగురంగుల ముగ్గులు.. రంగవల్లుల కోసం నగరాలన్నీ పల్లెలకు చేరాయి. నాలుగు రోజుల సంక్రాంతి కేరింతల కోసం నగరాన్ని మోసుకుపోయిన తెలుగు పల్లెలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.

నవ్వుల కాంతులు చిమ్ముతూ సంబరాలు జరుపుకొనే పండుగ ఇది! ధాన్యలక్ష్మి కరుణించి పంట మన చేతికందించే పెద్ద పండుగ! ధనలక్ష్మి కటాక్షించి చేతినిండా సిరులు కురిపించే తెలుగువారి పండుగ! అందుకే సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవంలా జరుపుకొంటారు. సూర్యుడు నెలకు ఒక నక్షత్ర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అదే సంక్రమణం. సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రమణం. అదే సంక్రాంతి పర్వదినం. సంక్రాంతితో దక్షినాయనం ముగిసి.. ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతినాడు చేసే స్నాన, దాన, జపాదులు విశేష ఫలదాయకం.