యాదాద్రి స్వామికి 3కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన మల్లారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదును ఆలయ అధికారులకు మంత్రి మల్లారెడ్డి గురువారం ఉదయం అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరపున కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.

ఘట్‌కేసర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు యాదాద్రికి ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆ నగదును మంత్రి అందజేసి, స్వామి వారిని దర్శించుకున్నారు.