మెగాస్టార్ చేతుల మీదుగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి హుషారెత్తించే సాంగ్!

సుధీర్ బాబు తన కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తనకి నచ్చిన .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఆయన మాస్ ఆడియన్స్ కి మరికాస్త దగ్గరగా వెళ్లాలనే ఉద్దేశంతో ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాను చేశాడు. ‘పలాసా 1978’ సినిమాతో అందరి దృష్టిలో పడిన కరుణకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆనంది అలరించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ‘మందులోడా ఓరి మాయలోడా’ అంటూ ఈ పాట జోరుగా.. హుషారుగా సాగుతోంది. జానపద బాణీలో మణిశర్మ స్వరపరిచిన ఈ పాట, మాస్ ఆడియన్స్ మనసు దోచేలా ఉంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, సాహితి చాగంటి – ధనుంజయ ఆలపించారు. విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నాడు.