బహవల్‌పూర్‌లో తలదాచుకున్న మసూద్ అజర్.. రక్షణ కల్పిస్తున్న పాక్ సైన్యం

ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌లా తానెక్కడ అతీగతీ లేని చావు చస్తానేమోనని  జేషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ తెగ భయపడిపోతున్నాడు. లాడెన్ లాంటి చావు తనకు రాకూడదని కోరుకుంటున్న మసూద్..  బహవల్‌పూర్‌లో రెండు విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నాడు. ఈ రెండింటిలో ఒకటి ఒస్మాన్-ఒ-అలీ మసీదు పక్కన ఉంటే, మరోటి అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జామియా మసీదు పక్కనుంది.

ఈ రెండింటికీ పాక్ సైన్యం నిరంతరం భద్రత కల్పిస్తోంది. ఈ రెండు భవనాలున్న ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం జరిగినా క్షణాల్లో అజర్‌కు తెలిసిపోతుంది. అప్పట్లో లాడెన్ ఉన్న అబోటాబాద్‌లో జనసంచారం అంతగా ఉండదు. కాబట్టే అమెరికా దళాలు అతడిని సులభంగా మట్టుబెట్టగలిగాయి. భారత ప్రభుత్వం నుంచి తనకు అలాంటి గతి పట్టకూడదన్న ఉద్దేశంతోనే అజర్ ఈ ప్రాంతాలను ఎంచుకున్నాడు.

2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో మసూద్ అజర్ భారత్‌కు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది. కరుడుగట్టిన ఉగ్రవాది అయిన మసూద్‌ను పాక్ ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. అతడికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రక్షణ కూడా కల్పిస్తోంది.

భారత పార్లమెంటుపై దాడితోపాటు 2016 పఠాన్‌కోట్ దాడి, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి కేసులోనూ అజర్ హస్తం ఉందని భారత ప్రభుత్వం స్పష్టమైన సాక్ష్యాలను పాకిస్థాన్‌కు పంపింది. అయినప్పటికీ అతడిని అప్పగించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. అంతేకాకుండా అతడిపై ఈగ వాలకుండా భద్రత కూడా కల్పిస్తోంది.