విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖలోని స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్‌లోని టీపీసీ-2లో టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తరచు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. గత ఏడాది జనవరి నెలలో వారం రోజుల వ్యవధిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రెండు ప్రమాదాలు జరిగాయి.