చైనాతో యుద్ధం చేయాల్సి రావొచ్చు: డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనాలు యుద్ధం చేసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికితోడు త్వరలోనే అమెరికా, చైనా ఉన్నతాధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్న వేళ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే, పనిలో పనిగా బైడెన్ ప్రభుత్వంపైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. అమెరికాను ఇప్పుడు అవినీతి, బలహీన ప్రభుత్వం పాలిస్తోందని, ఈ ప్రభుత్వాన్ని చైనా గుర్తించడం లేదని విమర్శించారు. ఇక ఎప్పటిలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మరోమారు ఆరోపించారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి సేనలను ఉపసంహరించుకున్న సమయంలో 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను వదిలేసి రావడంపై ట్రంప్ మాట్లాడుతూ.. చైనా, రష్యాలు ఇప్పుడా పరికరాలను రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సొంతంగా తయారుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.