మెగాస్టార్ పుట్టినరోజు వారోత్సవాలు

  • మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసిన తుమ్మి లక్ష్మిరాజ్
  • మెగాస్టార్ చిరంజీవి స్థాయి శిఖరం, ఆయన జోలికొస్తే తాటతీస్తాం

విజయనగరం: మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 16నుండి ఆగష్టు 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న హోటల్ జి.ఎస్.అర్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా చిరంజీవ జన్మదిన వారోత్సవాల కరపత్రాలను చిరంజీవి యువత ప్రతినిధి, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మిరాజ్ విడుదల చేశారు. అనంతరం మీడియాతో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మెగాఫ్యామిలీ ఎల్లప్పుడూ సమాజం, అభిమానుల శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటుందని, అందుకోసం మా ఆరాధ్యదైవం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమాల్లో ముందుగా ఆగష్టు 16న ఉచిత నేత్ర వైద్యశిబిరం, 17న మొక్కలు నాటే కార్యక్రమం, 18న అన్నదాన కార్యక్రమం, 19న మెగాడాన్స్ పోటీలు, 20న కేన్సెర్ పరీక్షలు, 21న ప్రత్యేక పూజలు, మరియు ఆగష్టు 22న మెగా రక్తదాన శిబిరాన్ని మరియు కేక్ కటింగ్ తో చిరంజీవి జన్మదిన వేడుకలతో ముగిస్తామని తెలిపారు. అనంతరం మీడియాతో జనసేన నాయకురాలు తుమ్మి లక్ష్మిరాజ్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్థాయి శిఖరమని, చిరంజీవి కోసం తక్కువ చేసి మాట్లాడిన పకోడీ గాళ్లుకు ఒకప్పుడు చిరంజీవి బతుకు పెట్టారని, ఇంకోసారి చిరంజీవిపై విమర్శలు చేస్తే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ వారోత్సవ కార్యక్రమాల్లో మెగాఫ్యామిలీ అభిమానులు, ఝాన్సీ వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ అంజనీపుత్ర మరియు జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు ముదిలి శ్రీనివాసరావు, బాబు, భార్గవ్, అభి హాజరయ్యారు.