నటుడు పొన్నాంబళం చికిత్సకు మెగా సాయం

ప్రముఖ నటుడు చిరంజీవి మరోసారి తన ఉదారగుణాన్ని చాటుకున్నారు. నటుడు పొన్నాంబళం సమస్యల్లో ఉన్నారని తెలుసుకుని చేయూతనిచ్చారు. పొన్నాంబళం కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ మార్పిడి కోసం రూ.రెండు లక్షలు పొన్నాంబళం బ్యాంకు ఖాతాకి డబ్బులు పంపారు చిరంజీవి. తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పొన్నాంబళం. ‘నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్‌ కోసం రెండులక్షల రూపాయలు పంపినందుకు ధన్యవాదాలు. మీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషించారు పొన్నాంబళం. ఈ ఇద్దరి కాంబినేషన్ అప్పట్లో ఓ సంచలనం. చెన్నైలో నివాసం ఉంటోన్న పొన్నాంబళం ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకీ ఇటీవల చిరంజీవి సాయం చేసిన సంగతి తెలిసిందే.