ఘనంగా మెహ్రీన్ నిశ్చితార్థం.. త్వరలోనే వివాహం

టాలీవుడ్ నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత, అదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్‌తో జైపూర్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గురువారం సాయంత్రమే వేడుక ప్రారంభం కాగా, ఉదయం మెహ్రీన్, బిష్ణోయ్‌లు పూజలు నిర్వహించారు. అనంతరం నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు.

నిశ్చితార్థం అనంతరం మెహ్రీన్ తల్లి పమ్మి పిర్జాదా మాట్లాడుతూ నేడు చాలా గొప్ప రోజని అన్నారు. ఈ ఏడాదే వారి వివాహం జరుగుతుందని, అయితే ఎప్పుడనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఎఫ్-2, కవచం, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో నటిస్తోంది.