కమలాహారిస్‌కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అభినందనలు తెలిపారు. కమలాహారిస్‌కు పోన్‌చేసిన మైక్ పెన్స్ ఆమెకు అభినందనలు తెలుపడంతోపాటు అధికార బదిలీకి సహకరిస్తానని చెప్పారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ప్రస్తుత పాలకులు ఫోన్‌చేసి అభినందించడం అమెరికాలో ఆనవాయితీగా వస్తున్నది. అయితే కమలాహారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చాలా రోజులకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ ఫోన్‌ద్వారా అభినందనలు తెలుపడం ఆసక్తిగా మారింది.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే వాదిస్తున్న ట్రంప్ మాత్రం కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి అభినందనలు తెలిపే సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. జో బైడెన్ మరో నాలుగు రోజుల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమై ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇప్పటివరకు ఆయనకు అభినందనలు తెలుపలేదు.