అయిదు రాష్ట్రాల మినీ సంగ్రామం, ప్రారంభమైన పోలింగ్…

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్‌, కేరళ, పుదుచ్చేరి లలో మొత్తం 475 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో జరుగుతుండగా, అసోంలో ఆఖది దశ, పశ్చిమ బెంగాల్‌లో మూడవ దశ పోలింగ్‌ జరుగుతోంది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకె, డీఎంకెలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ తలపడుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌, బీజేపీ కూటమిల మధ్య పోరు నెలకొంది. అస్సాంలో నేడు మూడో, చివరి దశలో భాగంగా 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో, ఇక్కడ మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో భాగంగా మంగళవారం 31 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 2న ప్రకటించనున్నారు.