ప్రతిష్టాత్మక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌కు మణిహారంగా దుర్గంచెరువుపై నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్‌ వంతెనను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ బ్రిడ్జిని నగరవాసులకు అంకితం చేశారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వి.శ్రీనివాస్‌గౌడ్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు వంతెనపై ఆర్మీ సెరమోనియల్‌, సింఫోనీ బ్యాండ్‌ను ఇండియన్‌ ఆర్మీ ద్వారా ప్రదర్శిస్తారని పురపాలక, పట్టణ అభివద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరు ఉత్సహంగా పాల్గొని లైవ్‌ బ్యాండ్‌ ప్రదర్శనను తిలకించాలని ఆహ్వానించారు. వంతెనపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించి వేరొక వైపు ఉన్న క్యారేజ్‌ వే ద్వారా ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యంత సుందరమైన లైటింగ్‌, సరస్సు బ్యాక్‌ డ్రాప్‌ ద్వారా బ్యాండ్‌ ప్రదర్శన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. నార్తన్‌ బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావం తెలిపేలా 45 నిమిషాల పాటు బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ‘వందేమాతరం’తో ప్రారంభించి పలు దేశభక్తి, భారతీయ, పాశ్చాత్య గీతాలు, సంగీతాన్ని ప్రదర్శించి ‘జయ హో’తో ముగిస్తారని వివరించారు. బ్యాండ్‌ ప్రదర్శన అనంతరం అనీశా సారథ్యంలో స్థానిక బ్యాండ్‌, ఇండియన్‌, వెస్ట్రన్‌ పాటలను ప్రజల వినోదం కోసం ప్రదర్శిస్తారని అర్వింద్‌ కుమార్‌ తెలిపారు.