కాంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కెటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణ వ్యర్థాలు తరలించే ఆధునిక (కాంప్యాక్టర్‌) స్వచ్ఛ వాహనాలను, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను కేటీఆర్ గురువారం ఉదయం ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని.. హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచామని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శంగా ఉందన్నారు. నగరంతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం 2 వేల స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే మో 2,700 ఆధునిక చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. చెత్త ట్రాన్స్‌ఫర్ సెంటర్లను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. దాంట్లో భాగంగా హైదరాబాద్‌లో 90 చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.