10వ తరగతి స్టడీ మెటీరియల్‌ విడుదల చేసిన మంత్రి సబితా…

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్‌ను విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాల్లోని కీలక భావనలను సులభంగా అర్థమయ్యేలా ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్టు తెలిపారు.. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో స్టడీ మెటీరియల్ విడుదల చేశారు. కార్పోరేట్ సంస్థలు రూపొందించే నోట్సుకన్నా ఈ మెటీరియల్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు మంత్రి సబిత.. స్టడీ మెటీరియల్ www.scert.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

మరోవైపు.. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును కూడా రూపొందించామన్నారు మంత్రి సబిత.. గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలను.. ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం బాషల్లో రూపొందించినట్టు తెలిపారు. వివిధ భాషలను నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వారికి బహు భాషా నిఘంటువు ఉపయుక్తకరంగా ఉంటుందని.. ఈ నిఘంటువు రాష్ట్ర, విద్యా పరిశోధన శిక్షణ సంస్థ చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందన్నారు సబితా ఇంద్రారెడ్డి.