బంగ్లా పర్యటనలో ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసిన మోదీ

ఢాకా: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల ఉన్నతాధికారులు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన శనివారం ముగిసింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ఆహ్వానించారు. అంతకుముందు తుంగీపారాలోని ‘బంగాబందు షేక్ ముజీబూర్ రెహ్మాన్’ సమాధి వద్ద నరేంద్రమోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.

తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. నైరుతి షాట్ఖిరా, గోపాల్‌గంజ్‌లోని జెషోరేశ్వరి, ఒరకాండి దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి సంభవించిన ఏడాది తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌కు బయలుదేరారు.

బంగ్లాదేశ్‌ 50 వ వార్షికోత్సవ వేడుకల్లో, షేక్ ముజీబుర్ రెహ్మాన్ 100 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబుర్‌ రహ్మాన్‌ శతజయంతి బంగారు, వెండి నాణేలను ప్రధాని మోదీకి షేక్‌హసీనా బహూకరించారు. అంతకుముందు 109 అంబులెన్సులను షేక్‌ హసీనాకు అందజేశారు.