మీడియాను కలవని మోడీ.. ఆ పత్రికకు ఆర్టికల్ రాశారు

మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించని మోడీ.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన ”ది డెయిలీ స్టార్” లో ప్రత్యేకంగా ఆర్టికల్ రాశారు. ఈ వైనం ఆసక్తికరమని చెప్పాలి. తాజాగా బంగ్లాదేశ్ పర్యటన కు వెళ్లిన ఆయన.. ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్నారు. ఆ దేశంలో తన పర్యటన ప్రారంభం కావటానికి ముందే.. తాను రాసిన ఆర్టికల్ ను పబ్లిష్ అయ్యేలా చూసుకున్నారు.

‘ఇమేజింగ్ ఏ డిఫరెంట్ సౌత్ ఆసియా విత్ బంగబంధు’ పేరుతో రాసిన ఆర్టికల్ లో.. ఆ దేశ తొలి అధ్యక్షుడు బంగబంధు షేర్ ముజిబుర్ రెహ్మాన్ చేసిన కృషిని ప్రస్తుతించారు. ఆయన బతికి ఉన్నట్లైయితే బంగ్లాదేశ్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ‘ఆయన హత్యకు గురి కాకపోతే మన ఉపఖండం మరోలా ఉండేది. ఆయన మరణం మన ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా రెహ్మాన్ తన పోరాటానికి కట్టుబడి ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

ఇంతకూ ఆయన ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఏమిటి? మీడియా ప్రతినిధులతో కలవని ఆయన ఏకంగా ఆర్టికల్ రాసేయటమా? అంటే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలే దీనికి కారణంగా చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ మీద మోడీషాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలోనే బంగ్లా పర్యటనను ప్లాన్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాను ఏ దేశంలో పర్యటిస్తున్నా.. ఆ దేశ ప్రజల చూపు తన మీద పడేలా చేయటంలో మోడీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తుంటారు. అందులో భాగంగానే ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థలో ఆర్టికల్ రాయటం ద్వారా బంగ్లాదేశ్ ప్రజలే కాదు.. బెంగాలీల మనసుల్ని దోచుకోవాలన్న వ్యూహం ఉందంటున్నారు.