తమిళనాడు, కేరళలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులు ప్రారంభం

త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళలో ప్రధాని మోడీ పర్యటించారు. ఆదివారం మధ్యాహ్నం కేరళలోని కొచ్చి చేరుకున్న ఆయన భారత్‌ పెట్రోలియంకు చెందిన రూ.6 వేల కోట్ల విలువైన పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రెండో దశ కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టుతోసహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో కేరళకు నిధులు కేటాయించామని చెప్పారు. జైళ్లల్లో ఉన్న ప్రవాస భారతీయులను విడుదల చేయాలన్న తమ విజ్ఞప్తికి పలు గల్ఫ్‌ దేశాలు సానుకూలంగా స్పందించాయని తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రానికి అన్నివిధాలుగా సహకరిస్తామని తెలిపారు.

అంతకుముందు చెన్నై చేరుకున్న ఆయన అక్కడ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గన్న మోడీ.. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తమిళనాడు రైతులు నీటి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు సిఎం పళనిస్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్‌ సెల్వం పాల్గన్నారు.