పోరంకి దక్షిణామూర్తి మరణం పట్ల సంతాపం తెలిపిన బండారు దత్తాత్రేయ

అక్షర తపస్వి డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారి మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దక్షిణామూర్తి తెలుగు రచయితలలో భాషావేత్త అని, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకుడిగా అనేక సకారాత్మక చర్యలు చేపట్టి తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, తెలుగు కథానిక పై పలు పరిశోధనలు చేసి డాక్టరేట్ కూడా పొందారని అనారు. మంచి ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు గల వ్యక్తిగా బండారు దత్తాత్రేయ గారు కొనియాడారు.

ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన పరమహంస యోగానంద రాసిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి తెలుగులో “ఒకయోగి ఆత్మకథ” గా అనువదించారు. దీనికిగాను ఉత్తమ అనువాదకుడిగా అవార్డు కూడా వరించిందని, తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారని, సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి చివరి శ్వాస వరకూ ఆధ్యాత్మిక భావాలతోనే కర్మయోగిగా జీవించారని తెలిపారు.

ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీవ్ర లోటు అని బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు.డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట ఘడియలలో కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.