100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో ముకేష్‌ అంబానీ

ప్రపంచ అగ్రశ్రేణీ కుబేరులు జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌ మస్క్‌ లాంటి అపరకుబేరులు సరసన ముకేష్‌ అంబానీ చేరారు. కనీసం వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల జాబితాలో ముకేష్‌కు తొలి సారి స్థానం లభించిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంపద క్లబ్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. ముకేష్‌ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముఖేశ్‌ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లు (రూ.7.5 లక్షల కోట్లు)గా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. ఈ ఒక్క ఏడాదిలోనే 23.8 బిలియన్ల డాలర్ల (రూ.18వేల కోట్లు)ను ఆర్జించారు. సంపన్నుల జాబితాలో మస్క్‌, బేజోస్‌ తర్వాత బెర్నార్డ్‌ అర్నాల్ట్‌, బిల్‌ గేట్స్‌, ల్యారీ పేజ్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, సెర్గే బ్రిన్‌, లారీ ఎలిసన్‌, స్టీవ్‌ బాల్మర్‌, వారెన్‌ బఫెట్‌, ముఖేశ్‌ అంబానీలు ఉన్నారు. మరోవైపు అదానీ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ 73.3 బిలియన్‌ డాలర్ల (రూ.5.5 లక్షల కోట్లు) సంపదతో 14 వ స్థానంలో కొనసాగుతున్నారు. ఒకవైపు ప్రపంచంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం విలయ తాండవం చేస్తుంటే ఇంకో వైపు ఈ అపర కుబేరుల ఆస్తులు ఏడాదికేడాది వందల, వేలరెట్లు పెరిగిపోతున్నాయి.