నిరుపేద బాలల పట్ల ముంబయి లేడీ కానిస్టేబుల్ మంచి మనసు

ముంబయిలో పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే షేక్ రెహానా ఓ ప్రత్యేకమైన మహిళ. పోలీసు విధులు నిర్వర్తించడమే కాదు, సమాజం పట్ల బాధ్యతతో నిరుపేద బాలబాలికల చదువుకు సహకరిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. చాలామందిలో ఖాకీలంటే కాస్త కఠినమైన మనస్తత్వంతో ఉంటారన్న భావన నెలకొని ఉంటుంది. కానీ రెహానాను చూస్తే తమ అభిప్రాయం తప్పని తెలుసుకుంటారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 50 మంది పిల్లలను ఆమె దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. వారంతా ఒకే స్కూలుకు చెందిన బాలలు. విధి నిర్వహణలో ఏమాత్రం విరామం దొరికినా, ఆ చిన్నారుల కోసమే సమయ్యాన్ని వెచ్చిస్తారు.

రెహానాకు ఈ విషయంలో కుటుంబ సభ్యులు అండ పుష్కలంగా ఉంది. ఆమె భర్త కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నారు. రెహానా కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉండగా, అటు వారందరికీ ఏర్పాట్లు చేసి, ఇటు 50 మంది పిల్లల విద్యా బాధ్యతలు చూసుకుంటూ ఓ మహిళ ఏంచేయగలదో నిరూపిస్తున్నారు.

కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఓ ఫ్రెండ్ చూపించిన కొన్ని ఫొటోలు ఆమెలోని సేవా దృక్పథాన్ని మేల్కొలిపాయి. ఆ ఫొటోలు ఓ పాఠశాల చిన్నారులకు సంబంధించినవి. దుర్భర దారిద్ర్యంతో ఉన్న ఆ చిన్నారులకు 10వ తరగతి వరకు విద్యా ఖర్చులను భరించాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నారు. రెహానా మంచి మనసుతో చేస్తున్న ఈ పని పట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు.