పురపాలక పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలి: దారం అనిత

చిత్తూరు: చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ ఇప్పుడు విద్యాశాఖలో పురపాలక పాఠశాలల విలీనానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలలతో పాటు ఆస్తుల బదిలీకి సంబంధించి పురపాలక కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనివల్ల ఎప్పుడో దాతలిచ్చిన పురపాలక పాఠశాలల ఆస్తుల పరిరక్షణ అన్నది అనుమానమే. రాష్ట్రవ్యాప్తంగా 59 పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో 2వేల 115 పురపాలక పాఠశాలు ఉన్నాయి. వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుతున్నారు. పురపాలక పాఠశాలు అంటేనే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసా అందించే విద్యాకేంద్రాలు. ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలలు కూడా విద్యాశాఖ పరిధిలోకి వస్తే వీటిని కూడా కుదించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో చదువు దూరమయ్యే ప్రమాదముంది. దీని వెనుక మంచి ఉద్దేశ్యం కనపడడం లేదు, కాబట్టి వెనక పడిన వర్గాలు చదివే పురపాలక పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలని అని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.