మురుగు కంపు కొడుతున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్

  • మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు ఆలనా పాలన కరువు
  • మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో బినామీలు తొలగించాలి
  • షాపులన్నింటికీ బహిరంగ వేలం నిర్వహించాలి
  • మున్సిపాలిటీకి వచ్చే అధిక ఆదాయాన్ని రక్షించాలి
  • మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మురుగు కంపు కొడుతోందని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. శనివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ లు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం మున్సిపాలిటీ పరిపాలన కు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మచ్చు తునకగా చెప్పుకోవచ్చు అని ఎద్దేవా చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ పాలన గాడి తప్పిందన్నారు. దీనికి ఉదాహరణగా షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే తెలుస్తోందన్నారు. 2006లో అప్పటి రాష్ట్ర అటవీశాఖ మాత్యులు శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో దివంగత చైర్పర్సన్ నరసింహప్రియా తాట్రాజ్ పాలనలో సుమారు రూ. 53 లక్షల వ్యయంతో 50 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేపట్టారు అన్నారు. అప్పటినుంచి మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ నుండి లక్షల ₹50 ఆదాయం వస్తున్నప్పటికీ దానికి ఆలన, పాలన కరువైందన్నారు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మురికి కూపంగా మారిందన్నారు. పశువులకు ఆవాసాలుగా, అసాంఘిక కార్యక్రమాలకు నివాసాలుగా మారిందన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని అధిక షాపులు బినామీ చేతుల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. మున్సిపాలిటీ నుండి అతి తక్కువ అద్దెకు బినామీ వ్యక్తులు షాపులు తీసుకొని వాటిని బయట వ్యక్తులకు అధిక అద్దెలకు ఇచ్చి లాభపడుతున్నారన్నారు. అదంతా మున్సిపాలిటీకి నష్టమన్నారు. తక్షణమే పాలకులు, అధికారులు కళ్ళు తెరచి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పై దృష్టి సారించి బినామీలను ఏరివేసి ఆయా షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపులను బహిరంగ వేలం వేయాలన్నారు. అప్పుడు అద్దెలు అధికంగా వస్తాయని, మున్సిపాలిటీకి మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. అలాగే పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డులో వ్యాపార కూడలి ప్రాంతంలో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిరాధారణకు గురికావడానికి కారణం నిర్వహణలోపమన్నారు. తక్షణమే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పై శ్రద్ధ చూపి సక్రమంగా నిర్వహించాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. అలాగే సంబంధిత అధికారులు, పాలకులు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపులు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో, వాటికి ఎంత అద్దెలు చెల్లిస్తున్నారో.. బహిరంగంగా ప్రకటించాలన్నారు. షాపుల నిర్వహణ, కేటాయించడం అద్దె వసూలు తదితర కార్యక్రమాల్లో అధికారుల చేతివాటం ఉన్నట్లు ఆరోపించారు. తక్షణమే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పై నిజానిజాలు ప్రజలకు తెలియ పరచాలని జనసేన నాయకులు కోరారు.