నాడు-నేడు కార్యక్రమం ఒక అభూత కల్పన: ముత్తా శశిధర్

కాకినాడ సిటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ నేటి వై.సి.పి ప్రభుత్వం అట్టహసంగా ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమం ఒక అభూత కల్పనలా కనపడుతోందని విమర్శించారు. వై.సి.పి ప్రభుత్వం మసి పూసి మాయ చేసినట్టు చేయటం తప్ప ఇందులో అభివృద్ధి మచ్చుక్కి కనపడటంలేదనీ కేవలం గోడలకు రంగులు పూయడం తప్ప ఇంకేమీ కనపడటం లేదని ఆరోపించారు. దీనిపేరు చెప్పి పట్టణంలో కొన్ని స్కూళ్ళు మూసివేసారనీ, జగన్నాధపురంలో బాలికల పాఠ్శాల లేక విద్యార్ధినిలు విధిలేని పరిస్థితులలో సాలిపేట బాలికల పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఈ వై.సి.పి ప్రభుత్వం కల్పించిందని, విద్యార్ధుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యలేదని దానిమీద మాత్రం ఈ వై.సి.పి ప్రభుత్వం పెదవి విప్పదని ఎద్దేవా చేసారు. మారుతున్న కాలంతోపాటు కొత్త విద్యావిధానాలని తీసుకువచ్చి చిన్న వయస్సులోనే మంచి విద్యా బుద్ధులు నేర్పితే అది సమాజానికీ తద్వారా దేశానికీ ఎంతో ఉపయోగకరం అన్నది ఈ వై.సి.పి ప్రభుత్వం మరిచిపొయిందనీ, నేడు రాష్ట్రంలో పాలన చూస్తే ఒకనాడు పెద్దలు చెప్పుకునే ధృతరాష్ట్ర పాలన అనే పదం ఎందుకు అనేవారో ఇప్పుడు అర్ధమవుతోందని అన్నారు. తాము పట్టణంలోని అన్ని స్కూళ్ళకు వెళ్ళి విద్యార్ధుల నుండీ సమాచారాన్ని సేకరించి వాస్తవ స్థితులను బట్టబయలు చేస్తామని తెలిపారు. జనసేన పార్టీ ఈ కుయుక్తులని తీవ్రంగా ఖండిస్తోందనీ, విధ్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకై పోరాటం చేస్తామని తెలియచేస్తూ పోస్టర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ,సిటీ సంయుక్త కార్యదర్శి కంట రవిశంకర్, వార్డు ప్రెసిడెంట్ శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీను, వీరబాబు, సత్తిరాజు, కోటేశ్వర రావు, దుర్గాప్రసాద్, సుంకర రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.