చేనిగుంట గ్రామంలో నీళ్ల కోసం రోడ్డెక్కిన గ్రామ ప్రజలు

సూళ్లూరుపేట నియోజకవర్గం, చేనిగుంట గ్రామ ప్రజలకు నీటి కొరత తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు రోసనూరు సోమశేఖర్ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులు పైగా తడ మండలం, చేనిగుంట గ్రామానికి చెందిన ప్రజలు నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు జనసైనికుల ద్వారా ఈ సమాచారం అందింది. ఈ రోజు వైసిపి పాలనలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై మహిళలు హైవే మీద నీటి బిందులను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు ఆ గ్రామానికి వెళ్ళిన ప్రస్తుత 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు వాటర్ అదనపు ట్యాంక్స్ నిర్మిస్తామని, నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలియజేశారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. దయచేసి నిర్లక్ష్య వైఖరికి తావు లేకుండా వెంటనే చేనిగుంట గ్రామ ప్రజలకు నీటి కొరత తీర్చాల్సిందిగా అలానే వాటర్ ట్యాంక్ నిర్మించాల్సిందిగా, మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున అధికారులకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని సోమశేఖర్ తెలిపారు.