భక్తులను రక్షించువాడు నాగేశ్వరుడు.. ‘నాగేశ్వరం’ జ్యోతిర్లింగ క్షేత్ర స్థలపురాణం

మహాదేవుడిని ఆరాధించడంలోనే భక్తులకు ఆనందం వుంది. ఆ భక్తుల పూజలను స్వీకరించడంలోనే సదాశివుడికి సంతోషం వుంది. తనని భక్తులు సేవిస్తూవుంటే మురిసిపోయే శివుడు, ఆ భక్తులను ఇబ్బందిపెట్టడానికి ఎవరైనా ప్రయతిస్తే ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. భక్తులకు వశుడైన శివుడు వాళ్లని హింసిస్తోన్న దుష్టశక్తుల ఆయుష్షును హరించివేస్తుంటాడు. తన భక్తుల పాపాలను నశింపజేసి పుణ్యఫలాలను ప్రసాదిస్తూ వుంటాడు.

ఆ మహాదేవుడిని పరశురాముడు … శ్రీరాముడు … శ్రీకృష్ణుడు వంటి అవతారపురుషులు ఆరాధించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. క్షత్రియ సంహారం చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి పరశురాముడు, రావణసంహారం చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికిగాను శ్రీరాముడు పరమశివుడిని సేవించారు. ఇక శ్రీకృష్ణుడు కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందిన తీరు ‘నాగేశ్వరం’ అనే జ్యోతిర్లింగ క్షేత్రంలో స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది.

గుజరాత్ లో గల ఈ క్షేత్రంలో నాగేశ్వరుడుగా పూజలందుకుంటోన్న సదాశివుడిని శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పబడుతోంది. ఇక్కడి స్వామి భక్తజనరక్షకుడిగా కనిపిస్తూ వుంటాడు. దారుక .. దారుకుడు అనే అసుర దంపతులు, ఇక్కడి సముద్రమార్గాన ప్రయాణం చేస్తోన్నవారిని హింసిస్తూ వుండేవారట. ఒకసారి ‘సుప్రియుడు’ అనే వర్తకుడు వాళ్ల బారినపడతాడు.

మహాదేవుడిని సదాసేవిస్తూ ఉండే సుప్రియుడినీ.. అతని సహచరులను ఆ రాక్షసులు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు. ఆ బాధలను భరించలేకపోయిన సుప్రియుడు దేవదేవుడిని ప్రార్ధిస్తాడు. మరుక్షణమే ఆ స్వామి సర్పరూపంలో వచ్చి అసుర దంపతులను సంహరించి తన భక్తుడికి విముక్తిని కల్పిస్తాడు. అందువలన ఇక్కడి నాగేశ్వరుడు భక్తులను కంటికిరెప్పలా కాపాడుతూ ఉంటాడని చెబుతుంటారు. పిలిస్తే పలికే ఆ స్వామిని పూజిస్తూ పునీతులవుతుంటారు.