నేవీ డే వేడుకలు.. విన్యాసాలు రద్దు

పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగాయి. పాక్ పై విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబరు 4 న విశాఖ తీరంలో నేవీ విన్యాసాలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం నిన్న సాయంత్రం విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించారు. అయితే కొచ్చిలో మాత్రం అమర జవాన్ల కోసం నేవి అధికారులు కేవలం జ్యోతి వెలిగించారు. విన్యాసాలను రద్దు చేశారు.

తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో 1971 డిసెంబర్ 4న భారత్ విజయం సాధించింది. మరోవైపు, వాయుసేన సైతం పాక్ వైమానిక స్థావరాలపై దాడిచేసి కకావికలం చేసింది. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డే జరుపుకుంటున్నారు. నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్‌ నిర్వహిస్తున్నాయి. రక్షణ దళంలోని త్రివిధ దళాలు అత్యంత ఘనకీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు.

నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఏటా ఘనంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా నేవీడే వేడుకలను రద్దు చేశారు. నిన్న ఉదయం విశాఖ బీచ్లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. సాయంత్రం సముద్రంలో నౌకలకు విద్యుద్పీపాలు అలంకరించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నేవీ ఎప్పుడు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.