ఏపీ ఎస్ఈసీగా నీలంసాహ్ని బాధ్యతల స్వీకరణ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించగా.. నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేశారు.

కాగా ఐదేళ్లపాటు ఎస్‌ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొత్త ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె తొలి ప్రెస్ మీట్ లోనే ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి.. ఏప్రిల్ 8, 10న ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.