నవంబర్ 1 నుండి నూతన విద్యావిధానం

నవంబర్‌ ఒకటవ తేది నుండి రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ప్రాధమిక పాఠశాలల్లో తరగతుల తరలింపు ప్రక్రియను ఆ రోజు నుండి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 172 సర్క్యులర్‌ ద్వారా ప్రాథమిక పాఠశాలలను విడగొట్టేలా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్ధులను 250 మీటర్లలో ఉన్న ఉన్నత పాఠశాలలకు తరలించనున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు 1,2 తరగతులు ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంటాయని, ఇందులో ఉపాధ్యాయులను 1:30 నిష్పత్తిలో ఉంటారని తెలిపారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ప్రాథమిక పాఠశాలల టీచర్లు, ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్లు బోధిస్తారు. హైస్కూళ్లకు సరిపడ టీచర్లు లేకపోతే డిఇవోల వద్ద మిగులు టీచర్లను కేటాయిస్తారు. వీరికి బోధన ఇంగ్లీష్‌ మీడియంలోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ విద్యార్థులకు సరిపడ గదులు లేకపోతే ప్రాథమిక పాఠశాలల్లోనే 3,4,5 తరగతులు కొనసాగుతాయి. హైస్కూళ్లల్లో ఉన్న టీచర్లు ఈ విద్యార్ధులతో పాటు హైస్కూళ్లల్లో ఉన్న 6 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు కూడా బోధించేందుకు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. . తరగతుల తరలింపు ప్రక్రియను అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా వ్యతిరేకించినా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం పూనుకోవడం గమనార్హం.