తెలంగాణలో కొత్త పార్టీ.. స్పందించిన కేసీఆర్

ఏపీ  ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా షర్మిల పేరును ప్రస్తావించకుండా ఆయన మాట్లాడుతూ, కొత్త పార్టీని పెట్టడం ఇంత ఈజీనా? అని అన్నారు.

ఒక పార్టీని పెట్టడానికి ఎంతో శ్రమ కావాలని చెప్పారు. గతంలో విజయశాంతి, దేవేందర్ గౌడ్, నరేంద్ర వంటి వారు పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? అని అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు రాలేదు? ఎన్ని పార్టీలు పోలేదు? అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ వచ్చినా… నాలుగు రోజుల్లో తోక ముడుస్తారని అన్నారు. కొత్త పార్టీల నేతలు తెరమరుగైపోతారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్సే అని అన్నారు.