మహారాష్ట్రలో నైట్‌కర్ఫ్యూ..

యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమై కరోనా కట్టడి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22, 2020 నుంచి జనవరి 5,2021 వరకూ మహారాష్ట్రలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు ఉద్ధవ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలిపింది. న్యూ ఇయర్ నేపథ్యంలో.. మహారాష్ట్రలోని పట్టణాలు, నగరాల్లో యువత పెద్ద ఎత్తున గుంపులుగా చేరే అవకాశం ఉందని.. అదే జరిగితే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాదు, యూరప్ దేశాల్లో కరోనా స్ట్రెయిన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యూరప్ నుంచి వచ్చే వారికి 14 రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ విధించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే వారికి కూడా ఈ నిబంధన వర్తించనున్నట్లు వెల్లడించింది.