దీపావళి తర్వాత సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం!

బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీయే కూటమిలోని జేడీయూ అధినేత నితీష్ మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీపావళి తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్యసభ సభ్యులు, జేడీయూ నాయకుడు కేసీ త్యాగి వెల్లడించారు. నిన్న వెల్లడైన ఫలితాల్లో ఎన్డీయే కూటమి 125 స్థానాలు, మహాఘటబంధన్ 110, ఎల్జేపీ ఒక స్థానంలో, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు.

బీహార్ తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ నేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని.. నితీశే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. ఎన్నికల్లో కొందరు ఎక్కువ సీట్లు గెలుస్తారు, మరికొందరు తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారు. కానీ తామంతా సమాన భాగస్వాములమని వెల్లడించారు.