ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు భావ్యం కాదు

•పోలీసులు సామరస్యంగా వ్యవహరించాలి
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఫోటోలను కాగితం ప్లేట్లపై ముద్రించి ఉండటాన్ని చూసి ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం భావ్యం కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ తరహా కాగితం ప్లేట్లను చూసి తమ నిరసన గళాన్ని వినిపించిన 18 మంది ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్ర ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా విషయాన్ని తీవ్రతరం చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలి. ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు అన్ని పార్టీలపైనా ఉంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు స్థానికంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఒక తాటిపైకి వచ్చి శాంతి కమిటీ వేసుకొని సుహృద్భావ పరిస్థితులు నెలకొనేలా చర్చించుకోవాలని జనసేనాని సూచించారు.