మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి లపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. అటు, హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు మూసివేస్తామని గత విచారణలో స్పష్టం చేసింది.