వందమందిని ఢీకొట్టనున్న ఎన్టీఆర్..!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వచ్చే ప్రతీ అంశం కూడా ట్రిపుల్ ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో కొమురం భీమ్ వందమంది బ్రిటీష్ సైనికులతో పోరాడే ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేయించిన జక్కన్న.. దీని కోసం మూడు వారాల పాటు కష్టపడినట్లు తెలుస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలు పడి చిత్రీకరించిన ఈ ఫైట్.. సినిమాలో ఓ ఎమోషనల్ సీన్ తర్వాత వస్తుందని టాక్ నడుస్తోంది.

RRR చిత్రంలో హైలైట్ గా నిలిచే అంశాల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒకటని ప్రచారం జరుగుతోంది. గతంలో రాజమౌళి – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో చేసే ఫైట్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ‘ఒకొక్కడినీ కాదు షేర్ ఖాన్.. ఒకేసారి వంద మందిని పంపించు’ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ తో జక్కన్న అలాంటి ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ ఎపిసోడ్ రూపొందించారని తెలుస్తోంది.