అమెరికాలో అదరగొడుతున్న భారతీయులు.. చదువులోనే కాదు.. సంపాదనలోనూ భేష్

అవును అటు ఉన్నత విద్యలోనూ.. ఇటు సంపాదనలోనూ అమెరికాలో మనోళ్లు అదరగొట్టేస్తున్నారు. మనోళ్ల తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే కాదు.. ఉన్నతంగా ఉన్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. అమెరికాలో భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారు దూసుకెళుతున్న వైనాన్ని స్పష్టం చెబుతోంది.

వివిధ జాతులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికాలో మిగిలిన ఖండాలతో పోలిస్తే.. ఆసియా ఖండానికి చెందిన వారి సంఖ్య గడిచిన మూడు దశాబ్దాల్లో మూడింతలు పెరిగినట్లుగా లెక్క కడుతున్నారు. జనాభా పరంగా అమెరికాలో వేగంగా డెవలప్ అవుతున్న జాతుల్లో ఆసియన్లే అధికమని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 40 లక్షలకు పైగా భారతీయ కుటుంబాలు నివిస్తుంటే..వారిలో 16లక్షల మంది వీసా ఉన్న వారుకాగా.. 14 లక్షల మందికి నివాస హోదా ఉన్నవారు ఉన్నారు. మరో 10 లక్షల మంది అమెరికాలోనే పుట్టిన వారు. ఇక.. మనోళ్ల సత్తాకు సంబంధించిన ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉన్నత చదువుల్లో మేటి.. సంపాదనలోనూ అదరగొట్టేస్తున్న దేశీయులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

అమెరికాలో భారతీయుల సంపాదన జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అమెరికాలోని కుటుంబ జాతీయ సగటు ఆదాయం 63922 డాలర్లు కాగా.. భారతీయులు.. భారత సంతతి కుటుంబాల సంపాదన మాత్రం అందుకు రెట్టింపు ఉండటం విశేషం. తాజాగా విడుదలైన కటుుంబ గణన నివేదిక ప్రకారం చూస్తే.. భారతీయ కుటుంబాల సగటు ఆదాయం 1.23 లక్షల డాలర్లు ఉండటం గమనార్హం.

భారతీయ కుటుంబాల తర్వాత అంత భారీగా సంపాదిస్తున్న దేశీయుల విషయానికి వస్తే 97129డాలర్లతో తైవాన్.. 95వేల డాలర్లతో ఫిలిప్పీన్ దేశాల వారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. 40వేల డాలర్ల వార్షిక సంపాదన కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల జాతీయ సగటు 33 శాతం కాగా.. భారతీయ కుటుంబాల సగటు 14 శాతం మాత్రమే. ఒక్క సంపాదనలోనే కాదు చదువులోనూ మనోళ్లు మిగిలిన వారి కంటే ముందున్నట్లు చెబుతున్నారు.

అమెరికాలోగ్రాడ్యుయేట్ల జాతీయ సగటు 34 శాతం కాగా.. భారతీయ కుటుంబాల్లో ఇది ఏకంగా 79 శాతంగా ఉండటం గమనార్హం. కంప్యూటర్ సైన్స్.. ఆర్థిక వ్యవహారాలు.. వైద్యం లాంటి కీలక రంగాల్లో అత్యధిక వేతనాలు ఉండే ఉద్యోగాల్లో భారతీయులే ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. అమెరికాలోని మొత్తం వైద్యుల్లో తొమ్మిది శాతం మనోళ్లే కావటం విశేషం. ఇలా ప్రతి విషయంలో మనోళ్లు దూసుకెళ్లిపోతున్న వైనం చూస్తే.. సగటు భారతీయుడిగా సంతోషం కలగటం ఖాయం.