క్షుద్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదు: నేరేళ్ళ సురేష్

  • ఓటమి భయంతో గొడవలు సష్టిస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతాం
  • జనసేన ఫ్లెక్సీలు చించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

గుంటూరు, ఎవరి రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో క్షుద్ర రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మూడు , ఎనిమిది డివిజన్ల పరిధిలోని పాత గుంటూరు , బాలాజీ నగరాల్లో జనసేన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించటంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై డివిజన్ అధ్యక్షులు జడ సురేష్, మాదాసు శేఖర్ లతో కలిసి ఆయన పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు అర్ధరాత్రి చించటం పిరికిపంద చర్య అంటూ విమర్శించారు.ఇటువంటి సున్నితమైన అంశాలతో ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించి అల్లర్లు సృష్టించాలనుకోవటం హేయమన్నారు. తాము ప్రజలకి చేసిందేమీ లేకపోవటంతో కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటమి కళ్ళముందు కనపడటంతో ప్రజల మధ్య గొడవలు పెట్టాలని చూస్తే మేమూ అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఫ్లెక్సీలు చించిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని నేరేళ్ళ సురేష్ పోలీసులను కోరారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ప్రధాన కార్యదర్శి యడ్ల నాగమల్లేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు బందెల నవీన్, డొంకేన మురళి, ఫణి శర్మ, శీలం మోహన్, గుబ్బ చందు, రమేష్, వెంకటేశ్వర్లు, వాలేష్, గడ్డం రోశయ్య, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.