రైతులకు ఒక చట్టం కబ్జాదారులకు మరో చట్టమా..?

  • 95 సెంట్లు పొలంలో నాటిన చెట్లను తొలగించిన అధికారులు
  • లబోదిబో ఏమంటున్న రైతు కుటుంబం

అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలంలోని, మల్లక్కగారిపల్లికి చెందిన రెడ్డి చర్ల వెంకటరమణ అనే రైతు తన 95సెంట్ల ప్రభుత్వ భూమిలో నాటిన మామిడి చెట్లను రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించినట్లు తెలిపారు. లోకాయుక్త ఆదేశానుసారం దాదాపు 60 మామిడి చెట్లను కూకటివేళ్లతో పేకలించినట్లు రైతు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి, అక్కడ దృశ్యాలు నష్టాన్ని పరిశీలించి, రైతుకు జరిగిన అన్యాయం చాలా దౌర్భాగ్యమని మాట్లాడుతూ.. సుండుపల్లి మండల కేంద్రంతో పాటు మండల కేంద్రానికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల కనుసనల్లో కబ్జాలకు గురవుతుంటే పట్టించుకోని రెవెన్యూ అధికారులు బోరు వేసి చెట్లు నాటి వ్యవసాయం చేస్తున్న రైతు చెట్లను తొలగించడం ఏమిటని జనసేన తరపున తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాలు, వంకలు, చెరువులు, గుట్టలు కబ్జాలకు గురవుతుంటే పట్టించుకోని అధికారులు రైతులపై పెత్తనం చెలాయించడం ఏమిటని పలువురు ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతుకు ఉన్న స్థలం పక్కన కాస్తో కూస్తో ప్రభుత్వ భూమి వ్యవసాయానికి వినియోగిస్తే నేరం. ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల కనుసనల్లో అధికారుల సహకారంతో విక్రయాలు చేయడం నేరం కాదా అని రైతులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లను అధికారులు కనికరం లేకుండా నరికేశారని రైతు బోరుమని విలపించారు.