ఏకసభ్య కమిటీ తక్షణమే విరమించుకోవాలి: వంపురు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, ఆంద్రప్రదేశ్ లో బోయవాల్మీకి, బెంతుఓరియా కులాలను బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలో మార్చుటకు ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఏకసభ్య కమిటీ తక్షణమే విరమించుకోవాలి. ఇప్పటికే స్వచ్ఛమైన ఆదివాసీలు(గిరిజనులు)ఉనికి కోల్పోతున్న పరిస్థితులను కల్పిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు బీసీ జాబితా నుండి బోయవాల్మీకి, బెంతుఒరియా కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చుటకు పూనుకోవడమంటే ఆదివాసీ సమాజాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుంది. వైసీపీ ప్రజా ప్రతినిధులారా, నాయకులారా కళ్లు తెరవండి భవిష్యత్ తరాలకు జరిగే కుతంత్రాలను, కుట్రలను నిలుపుదల చేయుటకు పార్టీలకు అతీతంగా జాతి ప్రయోజనం దృష్ట్యా ఏకసభ్య కమిషన్ ని రద్దు చేయించుటకు కృషి చేయండి. పార్టీ మీద వ్యామోహంతోనో, అభిమానంతోనో జాతికి జరిగే నష్టానికి మీరు బాధ్యులు కావద్దు. ఇతర పార్టీల మీద విమర్శలు చేయడం, ఆత్మాభిమానం చంపుకోవడం మానుకోండి. గిరిజన ప్రతినిధులుగా మీ బాధ్యతలను మరిచిపోకండి. జాతికి ద్రోహం చేయకండి. గిరిజన ప్రజల దృష్టిలో జాతిహీనులుగా మిగిలిపోవద్దు ఈ అంశంపై ప్రభుత్వం ముందుకు సాగితే ప్రజా ఉద్యమం చేపట్టడానికి వెనకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాము. అవసరాన్ని బట్టి న్యాయస్థానాలను అశ్రయించడానికి కూడా వెనకడేదిలేదని మరొక్కమారు స్పష్టంగా తెలుపుతున్నాము. విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ మిత్రులారా!, కార్మిక, కర్షక సోదరులారా! ఆదివాసీ సమాజంపై జరుగుతున్న ఈ కుట్రను ముక్తకంఠంతో అందరు వ్యతిరేకించి మనజాతి ప్రయోజనాన్ని కాపాడుకుందాం. అనాదిగా గిరిజన ప్రాంతంలో గిరిజన ఆచార, సాంప్రదాయలతో మమేకమై జీవిస్తున్నటువంటి కొండకుమ్మరి తెగను గిరిజన జాబితాలో చేర్చాలని ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు అతీతంగా పోరాడుతూ దశాబ్దాల తరబడి కోరుతున్న పట్టించుకోని పాలక ప్రభుత్వాలు, అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన బీసీ సామాజికవర్గాలను గిరిజన జాబితాలోకి చేర్చడానికి చూపిస్తున్న శ్రద్ధ ఆదివాసీ సమాజం అభివృద్ధికి మరియు జీవోలు, చట్టాలు, హక్కులు కాపాడే దాంట్లో ఎందుకు చొరవ చూపించట్లేదని ప్రశ్నిస్తున్నాం. ఇది విభజించి పరిపాలించు అనే బ్రిటిష్ పద్ధతి కాదా? ఇది సమస్య సృష్టించి రాజకీయ లబ్ధిని ఆశించే ప్రక్రియ కాదా? అని ప్రశ్నిస్తున్నాం. రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, గిరిజన మంత్రులు, గిరిజన ప్రజా ప్రతినిధులు మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయండి. గిరిజన జాతి పక్షమా?లేక గిరిజనులకు ద్రోహం తలపెట్టే ప్రభుత్వ పక్షమా? తేల్చి చెప్పాల్సిందే ప్రభుత్వ పక్షం ఉండండి కానీ జాతి ప్రయోజనం నాశనం చేయకండి. ఆత్మపరిశీలన చేసుకోండి గిరిజన జాతికి అండగా ఉండి పదవులు శాశ్వతం కాదని గుర్తించాలని డా.వంపురు గంగులయ్య అన్నారు.