కొనసాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి సాగరాన్ని చేరనున్నాడు. పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర మొదలైంది. ఖైరాతాబాద్ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడిని సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల లోపు గణేశుడి నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేసారు.

గణేశ్ నిమజ్జనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 330 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరంలో హుస్సేన్‌సాగర్‌తోపాటు మొత్తం 30 చెరువుల్లో నిమజ్జనాలు ఏర్పాటు చేశారు. కేవలం హుస్సేన్ సాగర్‌లో 2లక్షల 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. శోభయాత్రకు విచ్చేసే భక్తుల తాగునీటికి 30లక్షల వాటర్‌ ప్యాకెట్లను జలమండలి సిద్ధం చేసింది. అలాగే అత్యవసర పరిస్థితి కోసం దాదాపు 50 అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు.