ఏపీ-తెలంగాణ మద్య రవాణా విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన

ఆంద్ర ప్రదేశ్-తెలంగాణ మధ్య బస్సు సర్వీసులను తిరిగి కొనసాగించే విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇంకా తెరపడలేదు. అధికారుల స్ధాయిలో సుదీర్ఘంగా చర్చలు జరిగినా అవేవీ ఫలితం ఇవ్వలేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీ బస్సులు మాత్రం తిప్పలేని పరిస్ధితి. దీంతో ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు భారీగా ఆదాయాన్ని సైతం కోల్పోతున్నాయి.

ఏపీ-తెలంగాణ మధ్య కోవిడ్-19 నేపధ్యంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. దీనిపై రెండు రాష్ట్రాల రవాణాశాఖ ఆధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరు రాష్ట్రాలకు చెందిన రవాణా మంత్రులు రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

ఈ నెల 13న హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో ఏపీ రవాణామంత్రి పేర్నినాని, తెలంగాణ రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ భేటీ కానున్నారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇందులో ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పంతాలకు పోయి ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు ఆదాయాన్ని కోల్పోతున్న నేపథ్యంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని సీఎం జగన్‌ సైతం మంత్రులకు చెప్పిన క్రమంలో ఈ సారి జరిగే చర్చలపై ఉత్కంఠ నెలకొంది.