ఆదివారం మాత్రమే అనుమతి

తెలంగాణ ప్రభుత్వం ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనను హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసింది. రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన ఆ కేబుల్‌ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే, ఈ కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. వేలాది మంది కొత్త బ్రిడ్జిని చూసేందుకు వస్తున్నారు దాంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం మాత్రమే సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.

కాగా, కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చూసేందును నగర ప్రజలు బారులు తీరారు. వారిని ఉల్లాసపరిచేందుకు ఇండియన్ ఆర్మీ నిర్విహించిన సింఫనీ బ్యాండ్ ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆనందడోలయమానంలో ముంచెత్తింది. అక్కడకు విచ్చేసిన సందర్శకులు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి అందాలను చూసి పరవశించారు. చూడచక్కటి దృశ్యాలను పర్యాటకులు తమ సెల్‌ఫోన్‌లో బందించారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సందర్శించేందుకుగానూ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దీనికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మన దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు, కరోనా వారియర్లు, జిహెచ్‌ఎంసి సిబ్బంది సేవలకు సంఘీభావంగా బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.