రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల కొనసాగుతున్న నేపధ్యం లో ఈ రోజు సాయంత్రం ఐదుగురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు. ఈ ప్రతినిధుల బృందంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఐ(ఎం) నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ నుంచి డీ రాజా, డీఎంకేకు చెందిన టీకేఎస్‌ ఎలంగోవన్‌ ఉన్నారు. సాయంత్రం రాష్ట్రపతిని కలిసే ముందు ప్రతిపక్ష పార్టీల నేతలంతా మధ్యాహ్నం సమావేశమయ్యే అవకాశం ఉంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న కేంద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు. అనంతరం ప్రతిపక్ష నాయకులందరం మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా కేవలం ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలుస్తుందని తెలిపారు.