ఆర్డినెన్స్‌లు రద్దు రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై శుక్రవారం జిల్లాలలో నిరసనలు వెల్లువెత్తాయి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై రైతన్నలు రోడ్డెక్కారు. ఆర్డినెన్స్‌లను రద్దు చేయాల్సిందేనని కర్షకలోకం ముక్తకంఠంతో నినదించింది. పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలుపుతూ అధికార బలంతో బిజెపి ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ఆమోదింపజేసుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పాలిట శాపంగా మారనున్న బిల్లులకు వ్యతిరేకంగా ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా జిల్లాలోని పలు మండలాల్లో రైతుసంఘాల ఆధ్వర్యంలో రైతులు తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆందోళనలకు వామపక్షాలతో పాటు కార్మిక, ప్రజా, మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. స్వేచ్ఛావాణిజ్యం పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, మోదీ ప్రభుత్వానికి పతనం తప్పదని టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.