మన స్టార్, మెగాస్టార్

ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కానీ ప్రకాశిoచే నక్షత్రం ఒక్కటే, అలాగే టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు వచ్చినా చిరంజీవి మాత్రమే మెగాస్టార్. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక శిఖరం అని చెప్పవచ్చును. తన కృషి పట్టుదలతో సామాన్యుడి నుండి మెగాస్టార్ గా ఎదిగిన మెగాస్టార్ గురించి కొన్ని విషయాలు మీకోసం.

1955 ఆగష్టు 22, న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు చిరంజీవి జన్మించారు. చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చిరంజీవి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు. సోదరుడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరొక సోదరుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్నాడు.

చిరంజీవి తండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవారు ఆయన వృత్తిరీత్యా అనేక ఊర్లు  తిరగాల్సి వచ్చేది, దానితో చిరంజీవికి బాల్యంలో పెద్దగా ప్రాణ స్నేహితులు లేరు. చిరంజీవి తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు దాంతో ఆయన అన్ని విషయాలను తన తల్లితో మాత్రమే పంచుకునేవారు, ఆయనకీ చిన్నతనంలో ఆమే ప్రపంచం. చిరంజీవి ఏడవ తరగతి మొగల్తూరులో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో చదువుకున్నారు, ఇక్కడే చిరంజీవి నటనకు బీజాలు పడిన రోజులవి. చుట్టుపక్కల వాళ్లను ఇమిటేట్  చేయమని ఇంట్లో వాళ్ళు అడగడంతో చిరంజీవి అచ్చుగుద్దినట్టు అదేవిధంగా చేయడంతో అందరూ ఆయన్ని ప్రశంసించే వారు. ఈ ప్రశంసలే తన స్కూల్ యాన్యువల్ డే లో నాటకం వేసేలా చేశాయి, దానిలో తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది రేడియోల కాలం దాంతో అందులో వచ్చిన పాటలు వింటూ తనకు తోచిన విధంగా స్టెప్స్ వేసేవారు చిరంజీవి. ఆ స్టెప్స్  తర్వాత కాలంలో చిరంజీవికి కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. చిరంజీవి యావరేజ్ గా  చదివేవారు. ఎక్కువగా కుల్చురల్ ఆక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొనేవారు. ఎన్ సి సి లో భాగంగా చురుగ్గా పాల్గొనేవారు. టీమ్ లీడర్ కూడా అయ్యారు. ఎన్ సి సి లో టాప్ ర్యాంక్ కు చేరుకున్నారు. 1976లో మన స్టేట్ ను రిప్రజెంట్ చేస్తూ రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో లో ఇందిరా గాంధీ ముందు జరిగిన పరేడ్లో పాల్గొన్నారు. నటుడు కావాలంటే ఫిట్ గా ఉంటే సరిపోదు ఫిసిక్  కూడా ఉండాలి చూడగానే ఆకట్టుకునే రూపం ఉండాలి. చిరంజీవి 8, 9,10 తరగతుల బాపట్లలో చదువుకున్నారు. ఇంటర్లో బైపీసీ చదువుకున్నారు. చిన్నప్పటినుంచి ఆంజనేయస్వామి భక్తుడు ఆడ వారికి దూరంగా ఉండేవారు. చిరంజీవి డిగ్రీలో బీకాం చదివారు. నర్సాపూర్ లోని వై ఎన్ కాలేజీలో చేరారు. చిత్ర పరిశ్రమ అడుగులు వేసేలా చేసింది ఈ కాలేజ్ అని చెప్పాలి. అయితే చిరంజీవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో యాన్యువల్  డే ఫంక్షన్ లో ఒక నాటకం వేశారు అప్పటివరకు ఒక సాదారణ స్టూడెంట్ గా ఉన్న చిరంజీవి స్టార్ పోయారు. అలా చిరంజీవికి  బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. దీనితో తనకు ఒక ఆలోచన కలిగింది నా నటన ఇంత మందికి నచ్చింది అంటే నేను బాగా యాక్ట్ చేశాను కదా నేను ఎందుకు సినిమా లోకి వెళ్ళకూడదు అనుకున్నారట. అలా చదువు మధ్యలో ఆపేసి ఇండస్ట్రీ కి రాలేదు. ముందు డిగ్రీ పూర్తి చేసి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారి గురించి తెలుసుకున్నారు. అందులో ఎన్టీఆర్ కూడా ఒకరు కావడంతో ఆయన గురించి తెలుసుకున్నారు ఎన్టీఆర్ గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయన పెద్ద స్టార్ అయ్యారు నేను కలేనా అనుకుని  అడుగులు ముందుకు వేశారు. తన తండ్రి దగ్గరికి వెళ్లి ఒక సంవత్సరం కాలం టైం అడిగి ఈలోపు అవకాశం రాకపోతే ఉద్యోగంలో చేరతా అని చెప్పారు ఆయన ఓకే అని చెప్పారు. వెంటనే  చెన్నై లోని ఫిల్మ్  ఇన్స్టిట్యూట్ లో చేరారు యాక్టింగ్ నేర్చుకుంటూ నైట్ కాలేజీలో ఐసి.డబ్ల్యు.ఎ.ఐ కి ప్రిపేర్ అయ్యేవారు. సినిమాలో అవకాశం రాకపోతే ఉద్యోగం అయినా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కోర్స్ లో చేరారు. యాక్టింగ్ స్కూల్లో చిరంజీవి తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. యాక్టింగ్ కోర్స్ పూర్తి కాకుండానే కొంతమంది స్టూడెంట్స్ సినిమా సెలక్షన్సు ఉన్నాయి అనగానే ఆ సెలక్షన్సుకు వెళ్ళగా, డైరెక్టర్ రాజ్ కుమార్  స్క్రీనింగ్ టెస్ట్  చేశారు, చిరంజీవి సెలక్ట్ అయ్యారు. రాజమండ్రిలో షూటింగ్ ఉందని అక్కడికి రావాలని సినిమా వాళ్ళు చెప్పారు అలా యాక్టింగ్ కోర్సు పూర్తి కాకుండానే 1978 లో పునాది రాళ్లు సినిమా లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా లో నలుగురు హీరోలలో చిరంజీవి ఒకరు. సినిమా అవకాశం వచ్చింది ఏ పేరుతో ముందుకు రావాలి అనే సమస్య వచ్చింది శివశంకర వరప్రసాద్ హార్డ్ గా ఉంది శంకర్, ప్రసాద్ పేర్లతో ఆల్రెడీ యాక్టర్స్ ఉన్నారు.  దానితో పేరు గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నారు. అప్పుడు రాముల వారి గుడి లో ఉన్నారు బయట నుంచి ఆయన ఫ్రెండ్స్ చిరంజీవి చిరంజీవి అని పిలుస్తున్నారు ఎవరిని పిలుస్తారు అని అడగగా నిన్నే అంటూ సమాధానం ఇచ్చారు. కళ్ళు తెరచి చూసే సరికి ఎవరు లేరు అది అంతా కల. ఈ కల గురించి ఆయన తల్లి అంజనాదేవి తో చెప్పగా ఆమె చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి ఆ దేవుడే నీకు ఆ పేరు పెట్టాడు నీవు అదే పేరు కంటిన్యూ అవు అని సలహా ఇచ్చింది.

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవి తీసుకున్న మొదటి పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలకు పోషించారు.

హీరోగా నిలదోక్కుకోడానికి చిరంజీవికి మంచి అవకాశం తీసుకు వచ్చిన సినిమా ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ఖైదీ . ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 1990లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు. 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలన, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలన, సినీ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు. మళ్ళీ పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యి చిరు రీ ఎంట్రీ ఘనంగా సాగింది. ఆ సినిమాలో చిరు చాలా చలాకీగా నటించాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు.

 డాన్స్ లోప్రత్యేక శైలి  :

నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు. నాట్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చలన చిత్ర రంగంలో ఒక నూతన శకానికి తెర తీశాడనటంలో అతిశయోక్తి లేదు.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా పిలుస్తారు.

ప్రత్యేకమైన పాత్రలు :

శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిన నటన అద్బుతం.

మొదటిదశలో సహనటుడుగా,  విలన్ గా, కొంత కాలం నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ కథా చిత్రాల పాత్రలతో, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో,  అప్పుడప్పుడు హాస్య భరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలలో నటించి నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నారు.

తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా:

తెలుగులోనే కాకుండా ఇతర భాషలైన తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి మంచి మంచి చిత్రాల లో నటించారు.

మంజునాథ, సిపాయి (సినిమా) చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించి. అక్కడ విజయవంతమయిన తర్వాత తెలుగులోకి అనువదించబడినవి.

అత్తకి యముడు అమ్మాయికి మొగుడు రీమక్ గా గీతా ఆర్ట్స్ బ్యానరు పై నిర్మించిన  మాప్పిళ్ళై చిత్రాన్ని రజినీ కాంత్ కథానాయకుడుగా నిర్మించారు. ఇందులో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు.

గ్యాంగ్ లీడర్ హిందీ లో పునర్నిర్మించిన ఆజ్ కా గూండారాజ్ లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంద్ లో, దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్లో కూడా హీరో నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరోగా అనువదించబడింది.

కొదమ సింహం చిత్రం ఆంగ్లంలో తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికొ ఇతర దేశాలలో విజయవంతంగా ఆడింది.

సేవా కార్యక్రమాలు:
చిరంజీవి అక్టోబర్ 2, 1998లో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు. ‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బాంక్’ ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా కార్యక్రమాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలు ఇవి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు ‘అత్యుత్తమ సేవా సంస్థలు’గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

పురస్కారాలు:

డాక్టరేట్ : నవంబరు, 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ నుండి స్వీకరించారు.

పద్మభూషణ్:  జనవరి, 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ

రాజకీయ రంగ ప్రవేశం : చిరంజీవి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాని పేరు ప్రజారాజ్యం. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

పదవులు: డిల్లీలో అక్టోబర్ 28, 2012 ఆదివారం ఉదయం 11.47 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రి (ఇండిపెండెంట్ ఇన్‌ఛార్జి, టూరిజం) మెగాస్టార్ చిరంజీవి ప్రమాణ స్వీకారం చేశారు. పర్యాటక మంత్రి గా తన సేవలను ప్రజలకు అందించారు.