సింగపూర్‌ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్‌..

దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న వేళ ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్‌ సరఫరాకు పలు దేశాల సహకారం తీసుకుంటోంది. ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్‌తో జరిపిన చర్చలు సఫలంకాగా ఆక్సిజన్‌ అందించేందుకు ఆ దేశం అంగీకరించింది. ఈనేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో.. వైమానిక దళ విమానాల్లో భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎక్కిస్తున్న వీడియోను పంచుకుంది. త్వరలోనే ఆ ట్యాంకర్లు భారత్‌కు చేరుకోనున్నాయి.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. దిల్లీలో సమస్య తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక దిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆక్సిజన్‌ పడకలపై చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. దిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌లో ప్రాణవాయువు సరిపడా లేక గురువారం 25 మంది మృతిచెందారు.

తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు పూర్తికావస్తున్నాయని.. సాయమందించాలని పలు ఆసుపత్రి వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. దిల్లీలోని మూల్‌చంద్‌, బాత్రా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరగా.. ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.