హరీష్ శంకర్ సినిమా లో పవన్ క్యారక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ నిర్మించనున్నారు. పవన్ – హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ చిత్రాలు పాటు ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకం – రోజా పువ్వు కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నారని అర్థం అయింది. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ లెక్చరర్ గా చూపించబోతున్నాడట. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని హరీష్ ఈ స్క్రిప్ట్ లో సామాజిక అంశాలను కూడా ప్రస్తావించనున్నారట. హీరో గెటప్ లుక్స్ డైలాగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ సైతం పవన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటిలోకి #PSPK28 పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న హరీష్.. పవన్ నటిస్తున్న రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.