ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి 14వ తేదీన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారంనాడు జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్ళు కూల్చిన ఘటన తెలిసిందే. ఈ సంఘటన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనట్లు సామాజిక మాధ్యమాల గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అందచేస్తారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.