కులాల వెనుక దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా: పవన్ కళ్యాణ్

‘‘తుమ్మెదల ఝూంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. మా మహిళా నేతల పదఘట్టనలు.. జనసైనికుల సింహగర్జనలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలూ సహజం’’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ప్రారంభించారు. నేడు మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై ఘాటుగా సెటైర్లు వేశారు.

కొన్నిరోజుల క్రితం కూడా ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ పవన్ ఒక కవిత షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కూడా అదే కవితతో ప్రసంగం మొదలుపెట్టారు. పదహారేళ్ల కుర్రాళ్లే వైసీపీ నేతలకు సంస్కారం నేర్పిస్తారని ఆయన అన్నారు. డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం వంటి లక్షణాలు వైసీపీ నేతలకు పుష్కలంగా ఉన్నాయన్నారు. వారికి ఇంక భయం ఒక్కటే లేదని, దాన్ని తాను కచ్చితంగా నేర్పిస్తానని అన్నారు.

అనాల్సిన మాటలన్నీ అనేసిన తర్వాత కులాల వెనుక దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతానని పవన్ హెచ్చరించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి తాను చాలా బాధ్యతగా ఉన్నానని, ఒక మాట కూడా తూలడం జరగలేదని చెప్పారు. తాను బాపట్లలో పుట్టానని, తనకు బూతులు రావా? అని ప్రశ్నించారు.