టీటీడీలో పూజలు సక్రమంగా చేయకపోతే వేంకటేశ్వరస్వామి క్షమించడు: జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పూజలను సక్రమంగా నిర్వహించకపోతే వేంకటేశ్వరస్వామి ఉపేక్షించరని చెప్పారు. స్వామివారి మహిమలు అందరికీ తెలుసని అన్నారు. తాను కూడా శ్రీవారి భక్తుడినేనని చెప్పారు.

టీటీడీపై పిటిషనర్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా అనే విషయాన్ని తాము తెలుసుకోవడం కోసం వారంలోగా పూర్తి వివరాలను ఇవ్వాలని టీటీడీ తరపు న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై పిటిషనర్ ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీటీడీలో జరిగే పూజల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు.